Showing posts with label naa kavitalu. Show all posts
Showing posts with label naa kavitalu. Show all posts

నవ్వు..

చలువ చందనాలు పూసినట్టు 
చెరకు తీపి చప్పరించినట్టు 
చెవుల పిల్లి చిందులేసినట్టు 
చందమామ చేతికందినట్టు 
నీ నవ్వు - తెల్ల మల్లెపువ్వు!


నా కోసం...



నిరంతరం నా కోసం ఎవ్వరు ఏడవరు
నా కళ్ళు తప్ప..
నిరంతరం నా కోసం నాతో ఎవ్వరు నడవరు
నా అడుగులు తప్ప..
నిరంతరం నా కోసం నాతో ఎవ్వరు మాట్లాడారు
నిశ్శబ్దం తప్ప..
నిరంతరం నా కోసం  నాకు తోడుగా ఎవ్వరు ఉండరు
ఒంటరితనం తప్ప
నిరంతరం నన్ను నన్ను గా ఎవ్వరు గుర్తించరు
నా అంతరాత్మ తప్ప..
నిరంతరం నా కోసం నన్ను నన్నుగా ఎవ్వరు ప్రేమించరు
నా మనసు తప్ప..
అందుకే
 నాదైన నా లోకం లో నాకంటూ ఎవ్వరు లేరు నేను తప్ప..
                                                     
                                                     ... శ్రీ

చాలు...



విశ్వమంత చోటేల?
నీ మదిలో గుప్పెడంత స్థలము చాలు
సూర్యుడంత కాంతులేల?
నీ కళ్ళ మెరుపులు చాలు
వెన్నెలంత చల్లదనమేల?
నీ చిరునవ్వులు చాలు
తెనేలంత తియ్యదనాలేల?
నీ మాటలు చాలు
సముద్రమంత అమృతమేల?
నీ ప్రేమ చాలు
                      ... శ్రీ

నా హృదయం...


నా హృదయం ఒక సులలిత సుమం
ముట్టుకుంటే ముకుళించుకు పోతుంది
నా హృదయం ఒక మంచు పర్వతం
కనుచూపుకే కరిగిపోతుంది
నా హృదయం ఒక కారుణ్య మేఘం
కోరితే ప్రేమ ఝల్లులు కురిపిస్తుంది
నా హృదయం ఒకప్రేమ సముద్రం
ఆత్మీయత కోసం ఆరాటపడే నీ ఆర్తిని తీరుస్తుంది
నా హృదయం ఒక అమృత కలశం
అణువణువునా ఆనంద సుధని అందిస్తుంది
నా హృదయం ఒక అందమైన అద్దం
కించిత్ బాధ కలిగినా తునాతునకలైపొతుంది
                                                                   ..శ్రీ.

నాలో నేను...


నిట్టూర్పుల నిశి రాత్రి లో నిశ్శబ్దంతో నేస్తం చేస్తూ కొండ దాటి కోన దాటి ఎక్కడో ప్రపంచానికి దూరంగా
వెన్నెల మైదానాలలో భావుకత పరిచే
బరువైన భావాలనీ,అరుదైన అక్షరాలనీ
అనుభవిస్తూ,చదువుతూ అలుపెరుగని అద్భుతాన్ని ఆస్వాదిస్తూ,ఆలోచిస్తూ,
కరిగిపోతూ,కంటతడి పెడుతూ,
పరుగెత్తే ఝరుల మధ్య
వినువీధిని తేలియాడే జ్యొత్స్నా సరిత్తులలో
అనురాగపు అంచుల మీద నిలబడి
ప్రపంచాన్ని గర్వంగా చూస్తున్న నేను
ఒక ఫాంటసీ లా నా కళ్ళ ముందు కదులుతుంటే
ఎక్కడొ తిమిర సాగరపు అవతలి తీరానికి
నన్ను రా రమ్మని పిలుస్తోంది నా అంతరాత్మ
నేను ప్రపంచాన్ని చూడకూడదని కాదు..
నాలోని నిజమైన నన్ను ప్రపంచానికి చూపించడం ఇష్టం లేదని!!!
                                                                                         ..శ్రీ.

నీవు జీవితానివి...


నేను పూవునైన నాడు నీవు తావివైన చాలు
నీవు జీవితానివి నీవు నాకు ఉన్న చాలు...

నేను దీపమైన నాడు నీవు కాంతివైన చాలు
నీవు జీవితానివి నీవు నాకు ఉన్న చాలు...

నేను కావ్యమైన నాడు నీవు భావమైన చాలు
నీవు జీవితానివి నీవు నాకు ఉన్న చాలు...

నేను భావమైన నాడు నీవు భాష్యమైన చాలు
నీవు జీవితానివి నీవు నాకు ఉన్న చాలు...

నేను గానమైన నాడు నీవు రాగమైన చాలు
నీవు జీవితానివి నీవు నాకు ఉన్న చాలు...

నేను వేణువైన నాడు నీవు ఊపిరైన చాలు
నీవు జీవితానివి నీవు నాకు ఉన్న చాలు...

నేను చిత్రమైన నాడునీవు వర్ణమైన చాలు
నీవు జీవితానివి నీవు నాకు ఉన్న చాలు...

నేను మువ్వనైన నాడు నీవు సవ్వడైన చాలు
నీవు జీవితానివి నీవు నాకు ఉన్న చాలు...

నేను దాహమైన నాడు నీవు మేఘమైన చాలు..
నీవు జీవితానివి నీవు నాకు ఉన్న చాలు...

నేను కెరటమైన నాడు నీవు తీరమైన చాలు
నీవు జీవితానివి నీవు నాకు ఉన్న చాలు...

నేను తారకైన నాడు నీవు గగనమైన చాలు
నీవు జీవితానివి నీవు నాకు ఉన్న చాలు...

నేను స్వప్నమైన నాడు నీవు నయనమైన చాలు
నీవు జీవితానివి నీవు నాకు ఉన్న చాలు...

నేను ఆర్తినైన నాడు నీవు ఆర్ద్రతైన చాలు
నీవు జీవితానివి నీవు నాకు ఉన్న చాలు...

నేను పయనమైన నాడు నీవు గమ్యమైన చాలు
నీవు జీవితానివి నీవు నాకు ఉన్న చాలు...

నేను గమనమైననాడు నీవు ప్రెరణైన చాలు
నీవు జీవితానివి నీవు నాకు ఉన్న చాలు...

నేను హృదయమైననాడు నీవు ప్రాణమైన చాలు
నీవు జీవితానివి నీవు నాకు ఉన్న చాలు...

                                         .. శ్రీ.