అందుకే అట్లాంటా లో ఉన్నప్పుడు కూడ,మా పెద్దబ్బాయికి భోగిపళ్ళు పేరంటం పెట్టి మరీ చేసాను. అక్కడ రేగుపళ్ళు దొరకకపోతే చెర్రీ లతొ పోసాను భోగి పళ్ళు!
ఇప్పుడు బెంగళూరు లో రేగుపళ్ళూ ఉన్నాయి.. నాకు సరదా కూడా ఉంది! రాత్రే గబ గబా రేగుపళ్ళు కొనేసుకుని శనగలు నాన పెట్టేసాను. కానీ వచ్చి నాలుగు నెలలు అవుతున్నా పేరంటం పిలవడానికి ఇక్కడ నాకు ఎవ్వరూ తెలీదు! "పోనీలే మనమే ఇంట్లో చేసేద్దాం. ఎవరూ రాకపోతే ఎమైంది? భోగిపళ్ళు పొయ్యడం ముఖ్యం" అని చక్కగ సర్ది చెప్పేసేరు శ్రీవారు! సరే అని సర్దుకుపోయాను నేను!
భోగి రోజు పొద్దున పదవుతున్నా, ఇప్పటి వరకూ భోగిమంట ఎలానో చూడలేదు కనీసం బ్లాగులోకం లో భోగి ఎలా ఉందో చూసి ఆనందిద్దాం అని కూడలి లోకి వెళ్ళాను..!
ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుండా చుట్టూ ఉన్న వాళ్ళు వింతగా చూస్తున్నా కార్టన్ బాక్సులతో వాళ్ళ భోగి మంట వాళ్ళు వేసుకున్నారని రాసారు భావ నిక్షిప్త.
సంక్రాంతి లక్ష్మి ఎడ్రెస్సు కోసం పట్టణం మీద నెపం పెట్టి తానె వాపోయారు రాత-గీత బ్లాగరు.
భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు, శుభ కామనలు చెప్పే వాళ్ళు , జ్ఞాపకాల దొంతరలు నెమరు వేసుకునేవాళ్ళు, భోగి మంటల గురించి, రంగు ముగ్గుల గురించి రాసుకునేవాళ్ళు, నా లాంటివాళ్ళు ఈ బ్లాగు ప్రపంచం లో కోకొల్లలు. అందుకే... ఈ e-పేరంటం ఆహ్వానం.
భోగి సంక్రాంతి శుభాకాంక్షలు!!!